Monday, 30 March 2020

మారుతి శతకము

             మారుతి శతకము

                      రావూరి సత్యనారాయణ మూర్తి, మంచిలి
1.శ్రీ కళ్యాణ గుణాకరున్ సురనుతశ్రీరమ్యశోభాకరా
స్తోకప్రాజ్యకళాధరున్ జితరిపుస్తోమున్ గజాన్యున్ మదిన్
సాకారప్రమథున్ నుతామరవరస్తవ్యామలాశాలయున్
రాకాచంద్రసమానసద్యశునియారాథింతునశ్రాంతమున్ .
2.వేయి కరంబులన్ వెలుగువేలుపు మ్రొక్కులజొక్కుతన్మహా
కాయునమేయసద్విజయుకాంచనచేలవిధేయు సత్కళా
ధ్యాయునజేయసద్బలసహాయు నుతాద్భుతరామభక్తి ధౌ
రేయుజితాతికాయు మది రేయిబవళ్ళు భజింతు మారుతిన్.
3.మానితదివ్య తేజు నవమానితరాక్షసరాజు దేవతా
మౌనిసమర్చితాభ్యుదయమండితపాదసరోజుక్ష్మాసుతా
ధీనమనోబ్జు తద్రఘువిధేయసమస్తసమాజరాజువి
జ్ఞానమహాబ్ధిరాజువిలసన్మతి గొల్తు నెడందమారుతిన్.
4.శ్రీ రఘు రామ పాదసరసీరుహలగ్నమనోంబుజాన్వితున్
భూరమణీసుతాభినుతిపూతవిభూతిసమేతు సుందరా
కారజితాబ్జనాభసుతు ఖండితశతృకులాన్వితున్ హృదిన్
నీరజనాభసన్నుతవినీతిసమన్వితు గొల్తు మారుతిన్.
5.మానితవిద్రుమాననునమానుషశక్తివితాను కార్యసం
ధానుకపిప్రధానుని సదాగతిసూనుజితాసురేంద్రసం
తాను విమానయానువినుతాద్భుతభక్తి నిధాను భక్తిస
మ్మానితవిశ్వయోని పవమానునిసూను నుతింతుమారుతిన్.
6.దీనజనావనాభ్యుదయదేవుని శ్రీ రఘు రామ భక్తునిన్
గానకళానురక్తు సితికంఠకృపాబ్ధిజలాభిషిక్తు త
ద్భానుకులాబ్ధిసోమపరధామవిరోధకళావిరక్తు సం
మ్మానగుణప్రసక్తు మహిమాన్వితభక్తు నుతింతుమారుతిన్.
7.ప్లవగకులావతంసు థృతపంక్తిరథాత్మజపాదపాంశు దే
వవరనుతోన్నతాంశు ననవద్యసుకీర్తిజితామృతాంశు క్ష్మే
శవరనుతప్రభావిజితసారసమిత్రఖరాంశు  జానకీ
శవినుతశంకరాంశుని ప్రశస్తకపీశు నుతింతుమారుతిన్
8.సద్వినుతాంజనేయు విలసద్రఘురామవిధేయు దేవతా
సద్విభువందితాభ్యుదయు సంచితసన్మహిమాద్వితీయునిన్
ఆద్విదాదివానరసహాయు విరించికృపార్జితాయుశ్రీ
మద్వభవాతిథేయు రుచిమండితకాయు నుతింతుమారుతిన్.
9.సర్వకళాలవాలు విలసద్రఘురామవిథేయుశీలు గాం
ధర్వకళావశీకృతనుతప్రభుజాలు దయాలవాలు దు
ర్గర్వసురారిశేఖరనికాయవిదారణవాలు లంకిణి
గర్వవిదారణైకబలు గౌరిపదస్థితఫాలు మారుతిన్.
10.అద్భుతవేగనిర్జితనుతానిలదేవు మనోజవున్ రమా
హృద్భవనస్థితోజ్జ్వలహరిస్తుతదీప్తిజితాదిదేవు నీ
డోద్భవవాహనాదివిబుధోత్తమనన్నుతభావు రుద్రవీ
ర్యోద్భవు నక్కపిప్రభువునూర్జితసద్యశు గొల్తు మారుతిన్.
11..పావని కైసరిన్ హరిని వానరముఖ్యుని కామరూపునిన్
భూవరరామభక్తిపరిపోషితజీవనధామునిన్ చిరం
జీవుని సర్వదేవనుతశీలమన్వితసత్కళాధునిన్
చేవదలిర్చుభక్తి తలచేరిచి చేతులు కొల్తు మారుతిన్.
12.వారనిభక్తిగొల్చెదనవారితబాహుబలాఢ్యునంజనా
వారిజపత్రనేత్రిసుతు వాయుకుమారు కపీశ్వరున్ చిదా
కారునుదారుచారుగుణకంధిసుధాకరు వీరు స్తుత్యస
త్కారు కుజేశపాదయుగతత్పరమాన్యవిచారు మారుతిన్
13.సదమలభావనాపటిమసత్కతహృత్కమలాభిరాముడు
ర్మదకలితాసురోద్ధతివిరాము కపీశకులాబ్ధిసోముభీ
ము దళితషడ్రిపూత్కరవిభూతిపరీతవిశేషధామునే
పదములు బట్టి మ్రొక్కెదశుభంబులుగోరిసతంబుమారుతిన్.
14.స్తుత్యనుతాద్భుతానుపమశోభసమిద్ధతనూవినిర్జితా
దిత్యునకిల్బిషాభ్యుదయదీప్తివిరాజితరామదేవతా
భృత్యునుతాఖిలాగమపరిష్కృతసంస్తుతసాహితీకళౌ
చిత్యునుతింతునాత్మకపిసైన్యవరున్ హరిమారుతిన్ సదా
15.తామ్రముఖున్ రమానిలయతామరసాప్తసుతైకసత్సఖున్
కమ్రసుధీకళాభిముఖు కశ్మలభావపరాఙ్ముఖున్ శుభున్
ఆమ్రఫలోన్ముఖున్ జితనుతార్యమచండమయూఖుసర్వదా
నమ్రత గల్తునయ్యనిలనందను నంజనిపుత్త్రుమారుతిన్.

No comments:

Post a Comment