Saturday, 30 December 2017

ముఖ్యమైనవి

              తెలుసుకోవలసిన విషయాలు
ఆతతాయులు--6 
1.ఇండ్లు తగులబెట్టువాడు,
2.విషము పెట్టువాడు,
3.చేతిలో శస్త్రమునుంచుకొనిచంపుటకు వచ్చువాడు,
4.ధనమపహరించువాడు,
5.భూమినపహరించువాడు,
6.భార్యను హరించువాడు.

యోగము=రాగల పదార్ధము.
క్షేమము=ఉన్నదానినిరక్షణము.

కర్మలు 4.
1.కామ్యములు-పుత్రకామేష్ఠి ,చిత్రాయాగ,జ్యోతిష్టో మాదులు .
2.నిత్యకర్మలు--సంధ్యావందన,అగ్నిహోత్రాదులు.
3.నిషిద్ధకర్మలు --సురాపాన,పరదారగమన, పరార్దా 
భిలాషాదులు.
4.నైమిత్తికములు ---జాతేష్టి,గృహదాహేష్టి,విశ్వ
జిత్యాగాదిశ్రౌతములు,గ్రహణస్నానాదిస్మార్తకర్మలు.

ఇష్టకర్మలు-1)అగ్నిసపర్య 2)తపస్సు 3)సత్యము 
4)వేదాధ్యయనము 5)అతిధిపూజ 6)హోమము.

పూర్వకర్మలు --1)మేట్లుగాలబావులు 2)కూపములు 
3)తటాకములు 4)దేవాలయములు 5)అన్నదానము 6)ధర్మముగా తోటలువేయుట.
పై కర్మలు శ్రేష్ఠములని తలంచువారుమూఢులు .

దు:ఖములు మూడు రకములు.
1)ఆధ్యాత్మికములు-జ్వరాదులవలనబాధలు.
2)ఆధిభౌతికములు-వ్యాఘ్రసర్పాదులవలనబాధలు.
3)ఆధిదైవికములు -వర్షాదులవలనబాధలు.  

మానవుడు 4 విధాల అవస్ధలలో నుండును.
బ్రహ్మచారి -
1)గాయత్ర-ఉపనయనానంతరం 3 దినములు 
క్షారలవణవర్జితముగా భుజించుచు గాయత్రిని జపించు వాడు గాయత్రుడు.
2)బ్రాహ్మడు-వేదగ్రహణపర్యంతం బ్రహ్మచర్యము 
సలుపువాడు.
3)  ఋతు కాలమందే స్వభార్యను పొందుచు నిత్యమును పరస్త్రీవిముఖుడుగా నుండువాడు.

గృహస్తు 4 విధములు 
1 .వార్తాకుడు --కృషి గోరక్షాడులను జేసికొని వైశ్యా ది వృత్తిచే జీవించుచు నిత్యనైమిత్తికాది క్రియాపరుడగువాడు.
2)శాలీనుడు -షట్కర్మ నిరతుడై యాజవాది వృత్తు లచేనార్జించువాడు.
3)యయావరుడు -యాజనాద్యాపన ప్రతిగ్రహవిముఖుడై అయాచిత వృత్తి చే జీవించువాడు.
4)ఘోరసన్యాసికుడు --వడకట్టిన శుద్ధజలముల తోస్వకార్యములనిర్వర్తించి ప్రత్యహమును హింసా విముఖతచే శిలోంఛ వృత్తికుడై గ్రామ వాసియై యుండువాడు.  

వానప్రస్ధు 4 విధములు -
1)వైఖానసుడు-గ్రామమునకు వెలుపల దున్నని భూమి యందు బండిన దాన్యములతో నగ్నిహోత్రాదులను జేయువాడు. 
2)ఔదుంబరుడు -ప్రొద్దుననే లేచి యే దిశను చూచునో అటుపోయి అత్తికాయలు,రేగుకాయలు,
నీవారధాన్యములు,చామధాన్యములచే కర్మలనా చరించువాడు.
3)వాలఖిల్యుడు -జటావల్కధారియై8మాసములార్జించి దానిని మిగిలిననాలుగు మాసములు  భుజించుచు ఇంకను మిగిలిన కార్తికమాసమున పరిత్యజించును.
4)ఫేనపుడు-స్వచ్ఛoదముగారాలినపర్ణఫలములను భుజించుచు నెచ్చటనైననుoడి కర్మలాచారించును.

పరివ్రాజకుడు --
1)కుడీచకుడు-తన కుమారుని యింట భిక్ష చేయుచు త్రిదండులయియుండు వాడు.
2)బహూదకుడు -ఉట్టి,కమండలువు,పాదుక,ఆసన,
శిఖా,యజ్ఞోపవీత కౌపీన కషాయవేషధారుడై భిక్ష 
చేసుకొనుచు ఆత్మధ్యానము చేయువాడు.
3)హంస-ఏకదండి,శిఖావర్జము,యజ్ఞోపవీతధారి 
కమండలపాణి,గ్రామైకరాత్రినివాసి కృఛ్చ్రచాం 
ద్రాయణ పరుడు.
4)పరమహంస--ఏక దండధరుడు,శిఖాయజ్ఞోప వీత రహితుడు,సర్వకర్మవర్జితుడు, ఆత్మనిష్ఠుడు.
(ఈతడొక్కడెే కర్మచేయనవసరములేదు.)          

గురువు-నిర్వచనము

                     గురువునకుఅర్ధములీక్రిందివిధముగానీయ
  బడినవి.భగవద్గీతలో ---
ఎవరి వలన అజ్ఞానముచే కల్గిన అహంకారమను 
బంధమునుండి విముక్తి కల్గునో అతడే గురువు.
గు:-అంధకారము,రు:-దానిని పోగొట్టువాడు.
గురు:-సంసార సముద్రమునుండి లేవదీయువాడు.
గుశబ్దస్త్వంధకారః స్యాత్ రుశబ్ద స్తన్నిరోధకః 
అందకారనిరోదిత్వాత్ గురురిత్యభిదీయతే 
అనగా ఆత్మానుభవజ్ఞానము గలవాడే గురువు.
బైబిలునందు గూడా  క్రీస్తుప్రభువు నేనే మార్గమును,నేనేసత్యమును,నేనేజీవమునైయున్నాను.  నాయనుగ్రహము లేనిదే ఎవ్వరును జగత్పిత వద్దకు వెళ్ళలేరని చెప్పెను.

Thursday, 2 November 2017

ullasam-: విద్య

ullasam-: విద్య:                            విద్య  విద్య అనునది రెండు విధాలు.1.శస్త్ర విద్య 2.శాస్త్రవిద్య. శస్త్రవిద్య  అనగా ఆయుధములనుప్రయోగమును తెలిపేద...

Wednesday, 26 July 2017

శ్రీమదుమాచోడేశ్వరశతకం -11
శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
91.శా||ప్రేవుల్ ప్రోవుగనయ్యుబుధ్ధి చలిత శ్రీ యయ్యుముండంబునం
దావేశించిన కంపమున్గలిగియున్ వ్యాధుల్ పిసాళించియున్
భావంబుచ్చియునాసవీడదెటులప్పా !మాకు మోక్షంబు ?శ్రీ
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! శరీరము ప్రేగులప్రోగువలె శుష్కించినను,
బుద్ధి సంపద చలించినను,తలకు వణుకు పుట్టినను,రోగములు వి
జృoభిoచినను, భావము నశించినను,ఈ జీవులకు ఆశ నశింపకున్నది.
అట్టి మోక్షమెటుల మాకు లభించునయ్యా ?
92.శా||ఏవో బాల్యమునందు గ్రీడలటుపై నింపై నప్రాయంబున
న్భావోద్భూతమదమ్మునించుదయుతామోహంబు వార్ధక్యమం
దావేశించినచింతయున్మాలయ నిన్నర్చించుటేలాగురా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! స్వామీ!బాల్యమునందు ఆటలు యౌవన వయస్సున
కాంతావ్యామోహము ముసలితనమున జింతయు జీవునిజీవితమునందంతట
వ్యాపించి నిండియుండగా నిన్ను బూజిoచుట యెట్లో తెలియరాకున్నది.

93 .శా||దేవా!సార్వజనీన భావ!సమతాదీప్తి ప్రభావా!యుమా
దేవీ సంశ్రిత వామభాగరుచిమద్దీవ్యద్వపుర్హావ! స
ర్వావాసానఘలింగసంగత మహాద్వైతానుభావా!శివా!
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! సమస్త జనుల యందుసమభావముగలవాడా!పార్వతీదేవితో
ప్రకాశించు వామభాగముచే  ప్రకాశించు శరీర శృంగార చేష్టలు గలవాడ!
సర్వము నివాసముగాగల లింగమున సంగతమైన అద్వైతవ్యక్తిత్వము
గలవాడా!నమస్కారము.

94.శా|| శ్రీవాణీగిరిజాత్రయిన్ హరిసుర జ్యేష్ఠాభవాద్యానుభా
వావాసంబగు బూరుషత్రయిని సంభావించి శాక్తస్ఫుర
ద్భావాద్వైతమవైన బ్రహ్మమ!భవద్భక్తిన్బ్రదీపింతు శ్రీ
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! లక్ష్మీ సరస్వతి పార్వతి యను శక్తిత్రయము విష్ణువు బ్రహ్మ
శివుడు అను పురుష త్రయము నీ యుభయముచే సమన్వితమైన శక్తి
విశిష్టాద్వైతస్వరూపమగు బ్ర్హమమువు.నీయొడల భక్తితోబ్రకాశించుదును.

95.శా||ఏ వాదమ్ములలోన నీస్ధితికిబ్రాహ్మీత్వంబు సిద్ధింపదో
ఏ వేదమ్ములలోన నీ యునికి గర్హింపన్బడున్ స్వామి !నా
కావాదమ్ములు వేదముల్ దృణమయ్యా! శాశ్వత బ్రహ్మమా
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! నీస్ధితికిబ్రాహ్మీత్వముసిద్ధించని వాదములు,నీ ఉనికిని
గర్హించు వేదములు నాకు తృణప్రాయములు.

96.శా||నావాడoచును నుండమట్లకులుడౌనారాయణ స్వామియం
దావేశించియు నాలయంబునకు దివ్యంబౌ పునర్నిర్మితిన్
గావింపన్  సమకట్టిజేసితి జగత్కల్యాణ! నాప్రార్ధనన్
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! నా ప్రార్ధనముతో నీవు శ్రీ ఉండమట్ల నారాయణస్వామిని
నావాడనిభావించిఅతనియందావేశించి ఆలయమును బునర్నిర్మింప                        జేసితివి. నీవు జగత్కల్యాణము గలవాడవు.

97.శా||దేవా!సత్యము !నీదు నీకృతినినుద్దీపింపగా జేయగా
శ్రీ విస్తారమునందజేసిన మహాశ్రీమంతులానందవ
ల్లీ వేద్యంబగు భోగముల్ గలిగి  ముల్లీలన్ బిసాలింతురో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నీకు జెందిన యీ కావ్యమును మఱలప్రకాశింప జేయుటకు
విశేషముగా (అన్నిరకాల)సంపదలనందించిన శ్రీమంతులు ఆనందవల్లి యను
ఉపనిష త్తునందు జెప్పబడిన శతానoదములను,బ్రహ్మానందములను అనుభవించి
యానందింతురు.ఇది నిజము.
99.శా||సేవింపన్ సమకట్టి నీ పయిని సుశ్రీమత్కృతిన్ వ్రాయగా
భావింపన్ గలిగించె స్వర్గతుడు సుబ్బారావు ధీమంతుడా
కావుల్గట్టని యోగి మిత్రుడల లింగంపల్లివ్లశ్యుండు నో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నిన్ను సేవించుటకు యత్నించి నీమీద మంచి కావ్యము
వ్రాయుటకు నాకు భావముగలిగించినవాడు ప్రస్తుతము స్వర్గమునందున్న
వాడు.అతడు లింగంపల్లి సుబ్బారావు.చాల బుద్ధిమంతుడు.నాకు మిత్రుడు.
నిజమునకాతడు కాషాయములు గట్టని యోగీశ్వరుడు.అతని ప్రేరణమే నాచే
నీకావ్యము వ్రాయించినది.
1౦౦.శా||గోవాహా!పరమేశా! శర్వ!యడపాగోపాలమిత్రుండునునీ
సేవన్ నాటికి నేటికిన్ సలుపుచున్ శ్రీమంతులౌవారి సు
శ్రీవిద్యాదికమెల్ల  నీ యెడల వాసిన్ బొందగా జూతునో
దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! ఓ వృషభ వాహనా!పరమేశ్వర! అడపాగోపాలమను
మిత్రుడు ఆనాటినుండి యీ నాటివఱకును నీ సేవ చేయుచు శ్రీమంతుల
సంపదయు విద్యావంతుల విద్య నీయెడల వినియోగపడి ప్రకాశించునట్లు
ప్రచారము చేయుచున్నాడు.



బాలింతరాలు తినే కాయం

రాధాస్వామీ

బాలింతరాలు తినేకాయపుండ-కావలసిన పదార్ధములు 1. పిప్పలి 10 గ్రాములు 2.మిరియాలు 50 గ్రాములు .

.నల్లజీలకర్ర 50 గ్రాములు
4.తెల్లజీలకర్ర 50 గ్రాములు
5.వట్టివేళ్ళు 10.౦౦
6.వసకొమ్ము 10.౦౦
7.కలింగ రాష్ట్ర 10.౦౦
8.దుమ్పరాష్ట్ర 10.౦౦
9.కరక్కాయ 2 లేక 4
10 .వాము 50 గ్రాములు
11.పసుపుకొమ్ము 2
12.శొంఠికొమ్ము 50 గ్రాములు
13.జాజికాయ 1 లేక 2
14.పాతబెల్లం 25 0 గ్రాములు

15 గానుగనూనె 

Sunday, 23 July 2017

                                    గురుస్తుతి
                            శ్రీ బూరాడ గున్నేశ్వరశాస్త్రి
రాధాస్వామీ మహానామ యోగాయతి పునఃపునః
మోక్షమావృత్తిరహితమ్ సచ్చిదానందదమ్ వ్రజేత్
సత్యసంసద్గురుమ్ దేవమ్ రాధాస్వామీ  మతాంకితమ్
దయాల్బాగు పురీవాసమ్ ఏకమ్ గురుముపాస్మహే .
జీవద్గురు సహాయేన నరోయాతి మహాద్భుతమ్
తస్మాదాంతర్యవిదృష్టమ్ యోగం ఘటపటాపహమ్ .
స్మరామి సంసద్గురు పాదపంకజమ్
కరోమి జీవద్గురు పూజనమ్ సదా
ధరామి విద్వద్గురు భక్తిరద్భుతమ్
భరామి జీవంచ గురోః ప్రసాదాత్.
శ్రీ సత్యసంసద్గురు దేవదేవః సమస్త సద్భక్త జనానుకూల:
సత్సంగసంస్ధాపనసారతేజః నిరంతరమ్ మంగళ మాతనోతు.
దయావినా భక్తిఫలమ్ నలభ్యతే
దయావినా ముక్తిపధమ్ తధైవ
దయావినా దర్శనమత్ర కీదృశమ్
దయాకురుధ్వమ్ గురుసార్వభౌమ.
జ్ఞానానందమ్ గురుం దేవమ్ సత్సంగీనాంచ రక్షణే
సర్వదా సర్వశక్తమ్ తమ్ మహాత్మాన ముపాస్మహే .
యన్నామ్నః ప్రధమార్ధకం విజయతే రాధేతి వర్ణద్వయం
సత్యయ్ శాశ్వతసంఘకార్యవిషయే స్వామీతి సంతప్రభు
ర్భూత్వా మోక్షప దానువర్త సుజనోధ్ధారం సదాకల్పయన్
రాధాస్వామి మతానుభూతకుశలస్సంసద్గురు:పాతునః .
             మంగళం సంతరూపాయ
            మహనీయ గుణాత్మనే
             శబ్దశక్తి  ప్రధానాయ

           గురుదేవాయ మంగళమ్ .   

Saturday, 22 July 2017

శ్రీమదుమాచోడేశ్వరశతకం -12

                         శ్రీమదుమాచోడేశ్వరశతకం -12
                                           శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
101 .శా||ఏవాడేనియు నాత్మదోషముల దానెంతేనియున్ నేరకే
            ఏ వానిన్ ఘనదోషయుక్తునిగా దానెంతేనియున్ జూపు
           సేవాసక్తుడొకండు నాపనికి దాజీకొట్టు నాత్మజ్ఞుడై
            దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!లోకమున సాధారణముగా బ్రతివాడును ప్రతివానిని
     దోషములు గలదానినిగా నిరూపించుటకు యత్నించును.కాని
     తనదోషములను గ్రహింపడు.నీ సేవయందాసక్తి గలవాడు మాత్ర
     మితరులనెన్నుపనిని అసహ్యించుకొనును.దానికి కారణము
    అతడు ఆత్మజ్ఞుడు.
102. శా||రావుర్యన్వయమందు బుట్టితిని నారామద్విజద్రావిడ
            శ్రీ వాస్తవ్యము శాఖ  ఋగ్నిగమమర్ధిన్ వేంకటేశాఖ్యుడన్
            ఏ విద్యావిభవంబు లేక నినునిట్లీరీతి బ్రార్ధించితిన్
           దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!ఆరామద్రావిడులను బ్రాహ్మణుల సంపదలకు
     నిలయమైన ఋక్ఛాఖలో రావూరి వంశమున బుట్టినవాడను.
     ఎట్టి విద్యావిశేషము లేకున్నను భక్తితో నిన్నీరీతిగా బ్రార్ధించితిని.

103.శా||ఈ విశ్వoబదియెల్ల సౌఖ్యముల బ్రాహ్మీభావనాలోక వి
           ద్యావైదుష్యము పండి ధర్మకలనాద్రాఘిష్ఠమై పొల్చుతన్
         నీవాసంబగు దేవిపట్టణమునన్దీపించుతన్ సంపదల్
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!ఈ ప్రపంచమంతయు ఇహసుఖములతో బ్రహ్మా
     జ్ఞానముతో వర్ధిల్లునుగాక.దేవీపట్టణమున సర్వసంపదలు
      వర్ధిల్లునుగాక.

104.శా||ఆవేశమ్మున మంచిచెడ్డలను సుంతైనన్ సమాలోచనం
           బేవేళన్ బచరింపకాత్మహితమున్ హింసించు కార్యమ్ములన్
          భావంబుల్ గికురింప సల్పుదునుదుర్వాదమ్ములన్ మాన్పవే
           దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! ఆవేశములో మంచిచెడ్డలను గొంచెమైననాలోచింపక
    యెల్లప్పుడు నా మేలును నేను హింసించుకొనుపనులతో భావములను
    మోసగించుట చెడు వాదములను చేయుదును.నా యీ దుస్దితిని
    మాన్పుము.

105.శా||రావంబుల్ సకలంబు లోకృతిని నర్ధస్ఫూర్తి దీపింప వి
          ద్యావ్యారాం నిధులామహత్త్వమునుసత్యంబంచు బోధింప నీ
         సేవల్ దానియధార్ధ సారమిడ నీ జీవుండు ముక్తుoడగున్
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!ధ్వనులన్నియు బ్రణవమున అర్ధస్ఫూర్తితొ బ్రకాశింపగా
    దాని మహత్త్వమునుజ్ఞానులు సత్యమని బోధింపగా నీ సేవ దాని యధార్ధతత్త్వముననుగ్రహించును. దానితో మాయాబద్ధుడగునీ
భక్తుడు ముక్తుడగును.  
106.శా||ఈ విశ్వంబదియెల్ల రాజ్యముగా నెంతేనిన్ వరింపన్ బ్రభు
           శ్రీ విస్తారము గల్గెనేని యెదలో జీవుoడు దుష్టించునా
           నీ వాల్లభ్యమునందుగా నిత్యంబు దుష్టించునో
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!ఈ ప్రపంచమంతయు నప్రయత్నముగా తనకు దానై
     రాజ్యముగా లభించినను జీవుడు హృదయపూర్వకమైనతృప్తినొందడు.
     నీ ప్రభుత్వమున గింకరుడైన వాడు శాశ్వతమైన తృప్తిని గాంచును.
107 .శా||ఏ వేళన్ మదినీవునిండి కవితాహిందోళముల్ రేపి నీ
            సేవాకాలమునoదు గోష్ఠికిని నాచే బద్యముల్ వ్రాయగా
            జేవల్ దేరగజేయుమయ్య కవిరాజీధన్యతన్ గూర్చి యో
            దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!  ఎల్లపుడు నీవు నా మనసులో పరిపూర్ణముగా నుండి
     కవితాసంగీతమును బ్రేరేపించి నీ సేవాకాలమునబఠించుటకు బద్యములను వ్రాయుటలో పటువైన నైపుణ్యమును,కవులలో ధన్యత్వము గలుగునట్లు
సమకూర్పుము .
108.శా||ఈ విశ్వంబదియెల్ల సంపదలతో నీశప్రపత్తి న్గలా
           సేవన్ దౌష్ట్యవిహీన జీవులకు రాశీభూత సౌజన్యమై
        భావాతీత భావన్మహత్త్వ కలనా భాగ్యంబులన్బండుతన్
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!


తా||ఓ చోడేశ్వరా!ఈ ప్రపంచమంతయు సంపదలతో ఈశ్వరభక్తితో మంచితనపు ప్రోవుగా భావాతీతమైన నీ మహిమములను భాగ్యముతో పరిపక్వమైసఫలమగుగాక!  

Wednesday, 19 July 2017

శ్రీమదుమా చోడేశ్వర శతకం -10

                శ్రీమదుమా చోడేశ్వరశతకం -10
                                        శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
86.నీ వాత్సల్యము జూఱగొంటగలుగున్ నిత్యత్వమున్ సర్వసౌ
     ఖ్యావిర్భూతియు సర్వదోషకలనవ్యావర్తనమ్మున్ గలా
    శ్రీ వైదగ్ధియు విశ్వసౌహృదము సౌశీల్యమ్ము భక్త ప్రియా
     దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!తండ్రీ!నీ వాత్సల్యమును పొందినచో జాలును.నిత్యము  సమస్త సౌఖ్యసంపదసర్వాదోషములు హరించుట కళలయందు పాండిత్యము విశ్వప్రేమ మంచి నడవడి లభించును
87.శా||ప్రావృణ్నీరదభాసమానగళ! ధీప్రప్రజ్ఞ!యోగాబ్జినీ                    
        శ్రీవిస్తారకమిత్ర!మోక్షఫలదా!ప్రేమాభిరామా!శివా
        సేనాధీన సమస్తాభావ!గుణరాశీ!నిర్గుణ ప్రాభవా!
       దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!వర్షాకాల మేఘమువలెనల్లనికంఠముగలవాడా! 
     ప్రకాశించు ప్రజ్ఞగలవాడా!యోగమను పద్మలతశోభకు సూర్యుడ వైనవాడా!ప్రేమతో బ్రకాశించువాడా!సేవకు వశమైన సమస్త భావములుగలవాడా!నిర్గుణమైన ప్రాభవము గల శివుడా!నీకు
  నమస్కారము.

88.శా||ఓ వందారు మనఃకుశేశయరవీ!ఓ మౌనిబృందారక
         శ్రీ విద్యాభవనా! ఒహో !ప్రమధ రాజప్రాంచదభ్యర్చన
        శ్రీ వేదా ఒహొహో!భవత్పదములన్జేరంగ జోటీయరా!
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నమస్కరించువారిమనఃపద్మములకు సూర్యుడ వైన
    ఓ దేవా!మునుల దేవతల శ్రీవిద్యలకు (జ్ఞానములకు)నిలయమైన ఓ                          స్వామీ! ప్రమధగణముల అర్చనార్ధమైన ఆగమముల స్వరూపము గలవాడా!నీపాదాల చెంత జేరుటకు నాకు కొంచెము చోటీయుము.
89.శా||ఈవేయన్దగువాడవేనడుగరాదే!యర్ధినై ;నాదు భా
          గ్యావిర్భూతికి నీ కృపాకలన నధ్యాసింపరా!సామి !నా
         భావంబార్షము వీడనట్లు వరమున్ బ్రహ్మాండభాండోదరా
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!స్వామీ!నీవిచ్చుటకు దాగిన సమర్ధుడవు.నేను నిన్ను అడుగవచ్చును గదా!అని అడుగుచున్నానుస్వామీ !నా భావము ఋషి
సంప్రదాయము నెపుడును విడువనట్లు వరమును నా భాగ్యావిర్భూతికి
గరుణతో సందానింపుము.నీవు బ్రహ్మాoడములన్నియు కడుపునదాల్చినవాడవు.
90.శా||దేవా!దాక్షిణకింకరుల్ ముసరినర్తింపన్ స్వబంధు  ప్రజా
         భావాలంతకుమించి గొండ్లిసలుపన్ వైద్యుండు వీడన్ గఫ
         ప్రావారాoబు గళంబుజుట్టకయ నీపై బుద్ధి రానీదగున్
            దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!దేవా!యమకిoకరులు చుట్టును ముసిరి గంతులు
   వేయుచుండగ తన బంధుసంతతుల భావములా యమకింకరుల గతులకంటెను ముక్కుతముగా బృందనృత్యము చేయగా వైద్యుడు
కూడా విడిచిపెట్టగ శ్లేష్మము గొంతును జుట్టివేయకుండగనే  యీ
జీవుని బుధ్ధి నీపై ప్రసరించునట్లు చేయుము.


శ్రీమదుమా చోడేశ్వరశతకం-6

శ్రీమదుమాచోడేశ్వర శతకం -6
శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
46.శా||దేవా! కర్షకసంఘమీజగతికిన్దేజంబునున్గూర్చుద
                   జ్జీవాధారమునన్నమిచ్చియును దచ్ఛ్రీసాధనంబౌనుగా
                  నీవాహంబగునుక్షమున్ శిరసునన్దీపించు గంగమ్మయున్    
                   దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

         తా||ఓ చోడేశ్వరా!రైతులు ప్రపంచానికంతటికి యన్నమునిచ్చితే జస్సును కలుగజేయుచున్నారు.నీ వాహనమైన ఎద్దు,నీ నెత్తిపైనున్న
గంగయు ఆ యన్నమును సృష్టించుటకు సాధనములగుచున్నవి.నీ
పరివారమే జగత్తులకు బ్రాణాధారమని భావము.
  47.శా|| ఏ వైదగ్ధికి సంతసించుదువో!స్వామీ!చూపరా!మద్గురు
              శ్రీ వాచా విభవమ్ములన్నిటన్  నిలచి రాశీభూతపుణ్యాకృతీ!
        హేవాకాయిత మారుతాశన! యుమాహ్రీభూషితరాoగశ్రీ
                   దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా|| ఓ చోడేశ్వరా!నాగభూషణ!పార్వతీదేవి సిగ్గుచే నలంకరింపబడిన యర్ధశరీరము గలవాడా! నీవేనేర్పునకానందిoతువో ఆ నేర్పును మా గురువుల వాక్కులలో నిలిచి నాకుదెలుపుము .

48.శా||నీవైపోయినదీజగంబు నెటులేనీ కాకయున్నన్  గటు
        ప్రావీణ్యoబులు నిండియుంటనిటులేవాడాగు శాపాగ్నితో
       నావంతేనియు లేనియట్లొనరుపండా!నీఱుగా సాధువో
       దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!ఈ ప్రపంచమంతా నీవైయున్నది.కానిచో
    తీవ్రములైన కుచ్చితములైన నేర్పులతో నిండిన యీ ప్రపంచము
    నే ఋషి యైనకొంచెమైనను మిగులకుండా తన శాపాగ్నితో బుగ్గిని జేసియుండకమానడు.

49.శా||లేవా? తావులు వల్లకాట దిరుగన్  హ్రీ లేదె!యా పార్వతీ
         దేవిన్ బేలను జేసినాడవుర!మంత్రిoపుల్ ప్రసారించి నీ
         సావాసంమున గజ్జెకట్టిన పిశాచశ్రేణితో శంకరా!
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఏమయ్యా!శంకరా!నీకు వల్లకాడు తప్ప ఇక చోటు దొరకలేదా?పిశాచాలతో తిరుగుచు పార్వతిని మోసగించావుగదయ్యా !
ఏ మంత్రం వేసావో గాని ఆమె నిన్నే వలచిన్దయ్యా!

50.శా||దేవాగారము భూసురోత్తముడు భుక్తిన్గూర్చు నా హాలికుం
        డావున్గుమ్మరియేరునున్బడియువైద్యస్వామియున్దానమున్
        లేవేయూరను నేవునుండవట యౌలే!ధర్మనీతి స్ఫుర
        ద్దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
తా||దేవాలయము,ఉత్తమ బ్రాహ్మణుడు,రైతు,ఆవు,కుమ్మరి,నది,
    బడి,వైద్యుడు,దానములేని యూరిలో నీవుండవట గదా!అవి యున్న                                     దేవీపట్టణమున కొండపై నున్నావుగదా.
51.శా||సేవన్ జేయని ఛాత్రుడున్ ఘనకృపాసింధుడనన్బోధన
         శ్రీ వైదగ్ధిని జూపలేనిగురుండున్ జెల్వుండుమెచ్చన్ గృతి
         ప్రావీణ్యమ్ముదొరoగుభార్యయు భవత్భక్తేతరుండొక్కడే
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

  తా||ఓ చోడేశ్వరా!గురుసేవ చేయని శిష్యుడు,దయాసముద్రుడై బోధించు
   నైపుణ్యములేనిగురువు,భర్త మెచ్చుకొనునట్లు మంచి పనులను
   చేయని భార్య,నీ సేవలకు దూరుడైనమనుజుడును సమానులు.

   52.శా||మోవిన్దేనియలనిచ్చు వేశ్యయువతుల్ పోటీకి రాలేరు వి
         ద్యావైదుష్యములుండి లేకయును స్వార్ధ ప్రజ్ఞకున్సత్ప్రజా 
          శ్రీ విస్తారములన్బలిన్గొనెడివారిన్ గెల్వజూడంగదే
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

   తా||విద్యావంతులయ్యు గొందఱు ,గాకయు గొందఱు స్వార్ధపరులై
        తియ్యని మాటలతో సజ్జనుల సంపదలనపహరించుచున్నారు.
       అధరసుధలనందించు వేశ్య యువతులు కూడా వారితో పోటీకి                              రాలేరు.అట్టివారినొక్క చూపు చూడవయ్యా ఓ స్వామీ!

53.శా||నీవా!ధర్మివి నేను ధర్మమును తండ్రీ నీవు లేకున్నచో
         నా వస్తుత్వము నిల్చునా?యభవ!సంధానింపునీవాస్ధితిన్
        నీవేనీనుగ నేనేనీవుగ భవానీరమ్యవామాంగ శ్రీ
       దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!
  తా|| నీవుధర్మివి.నేను ధర్మమును.నీవులేనిదే నా వస్తుతత్వము నిలువదు.తండ్రీ !చోడేశ్వరా!నేనే నీవు నీవే నేను అగునట్లు నా వస్తుత్వమును నిల్పుము.   

            

శ్రీమదుమా చోడేశ్వరశతకము -9

                       శ్రీమదుమాచోడేశ్వరశతకం -9
                                            శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
73.శా||నీవా! విశ్వవిశాలభావమవు నీనేనంటివా?సంకుచ
        ద్భావంబున్ జగదీశ భావములదౌద్వైతమ్ము వస్తుత్వమం
       దావేశింపదటన్న భావమిడరా!యద్వైతమైపోదునో
        దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నీవు ప్రపంచమంతయు నిండిన భావము.నేను పరిమితమైన భావమును .జగత్తు ఈశుడ అను భావములకు జెందిన
ద్వైతభావము,సమస్తవస్తువులందు ఆవేశిoపదని భావమునిమ్ము.నేనే
యద్వైతము(బ్రహ్మము)నగుదును.

74 .శా||ఆ వైకుంఠపతి ప్రవృత్తి కలితంబర్ధాoగనాకారా మా
           ర్షావిష్టoబమృతాఢ్యశీర్షమఘనిర్యాసమ్మఖండమ్ము యో
           గావాసమగు నీ స్వరూపమును దేవా !భక్తీ ధ్యానించెదన్
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! సకలలోకరక్షకుడైనవిష్ణుదేవుని ప్రవృత్తి చేతను
    గూడ నొప్పునది అర్ధనారీశ్వరరూపమైనది. అమృతముతో నిండిన
   శిరస్సు గలది(గంగతో నిండిన అమృతముచే నొప్పు చంద్రుడు గల
   శిరస్సు గలది)పరిపూర్ణమైనది.యోగమునకు నిలయమైనదిఅగు
  నీ స్వరూపమును భక్తితో ధ్యానించెదను.

75.శా||భీవారమ్మెడలున్ భవత్పదకృతి ప్రేయో విశేషమ్మునన్
           ధీ వైశద్యమునబ్బు త్వత్పదయుగా దీన ప్రవృత్తి న్మహా
           శ్రీ విస్తారమునిండు త్వత్పదనతి ప్రేయో విశేషమ్మునన్
            దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నీ పద సేవాకృతి చేతగలుగు మహాత్వవిశేషముచేత
    సకల భయములు దొలగును.నీస్ధానమును చేరుటవలనగలుగు మహ
త్వమువలనబుద్ధికినైర్మల్యముగలుగును.నీపాదములకునమస్కరించుటచేగలుగు మహత్వమువలన సకలసంపదలు పరిపూర్ణముగాగల్గును.

76.శా||కావుద్వేగములార్యధర్మసుకృతిo గల్పింప శక్తంబులో
         దేవా!తావక భవ్యపాదయుగళీ దీవ్యన్మరందామృత
         శ్రీ విస్తారముద్రావుటొక్కడగువాసిన్శక్తమార్యాయుతా   
            దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!వైదికమైన ఆర్యధర్మములగు సత్కార్యములకు
  సమకూర్చుటకు ఆవేశములు పనికిరావు.ఆవేశముచే సాధింప    వలనుపడవు.నీ పాదపద్మమకరందధారలగ్రోలు జీవసంతతి
మాత్రమే ఆర్యధర్మములనుద్ధరించుటకు శక్తమగును.   

77.శా||చావున్బుట్టువు గష్టమున్  సుఖము దుష్టంబదుష్టమ్మునా
        భావంబుల్ సమమైనయట్టిస్ధితిత్వత్పాదావ్యయాం భోజచిం
          తా వైశిష్ట్యమునందు దాగలదు తద్ధర్మక్రియాతుష్ట!శ్రీ
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!చావుపుట్టు కష్టముసుఖము దుష్టము అదుష్టము
     అను ద్వంద్వ భావముల సమానమైన స్ధితి నీ పాదపద్మముల
    యందెడతెగనిధారనయoదుండును.నీవు పరమార్ధధర్మకార్యములకు
    ఆనందించుదువు.  

78.శా||ఆవిర్భూత జగత్త్రయావనకలావ్యాపార వన్మూర్తిర
          మ్యా విశ్వాఖిలపూర్ణదివ్యమహిమా! మందారమాలాస్ఫుర
         ద్దేవానీక కిరీటకోటి విగళద్దీప్త్యాయితాంఘ్రిద్వయీ
          దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!ముల్లోకములను రక్షించు కలాత్మకమైన వ్యాపారముగల
    మూర్తులచే రమ్యమైనవాడా!విశ్వమునంతట నిండిన దివ్యమైన మహిమ గలవాడా!కల్పపుష్పములదండలతో ప్రకాశించు దేవతలకిరీట ములయంచులనుండిజారుచున్న కాంతిగా నగుచున్న శ్రీ చరణ యుగములు గలవాడా!   

79.శా||దేవా!సంఘమునుద్ధరించుటకునుద్దీప్తార్షముల్ శాస్త్రముల్
         ధీ వైశద్యపరంబులై పొలిచె దద్దీ ప్తిన్గనంజాలకీ
        సేవాదూరజనంబు సైన్సునిలవాసిన్ శాస్త్రమున్జేసెనో
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!ఋషి ప్రోక్తములైన శాస్త్రములు సంఘమునుద్ధరించుటకు
బుధ్ధి వైశద్య పరములై యొప్పియున్నవి.సేవాదూరులైనసైన్సును శాస్త్రముగాచెప్పుచున్నారు.               

      80.శా||ఆవాసాయితరాజతాచల ! పరార్ధార్ధిప్రజాహార్ధవి
           ద్యా!విశ్వాలఘుభక్తియోగఫలసంధానైక దీక్షాలఘు
           శ్రీ విస్తారితచక్రవర్తిపదవీ! శ్రీకంఠ !విశ్వేశ్వరా!
            దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!వెండికొండనివాసా!పరమార్ధమునుగోరుప్రజల
హృదయసంబంధమైన విద్యయైనవాడా! ప్రపంచాన స్ధిరమైన భక్తియోగమునకు ఫలమును సమకూర్చు సాటిలేని దీక్షయను
సంపదచే విస్తారమైన సార్వభౌమపదవిగలవాడా! శ్రీకంఠ! విశ్వేశ్వరా!

81.శా||చేవల్ దేరిన యోద్ధతోనెదిరి వాసిన్గాచంగా వచ్చు నే
        యేవిద్యాసమరంబులందయినగానీ యజ్ఞతా రూపమౌ
       నీవైరి న్గె లువంగశక్యమగుటె సంసారాజినిన్నెoచకో
       దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!  ఆరితేరిన ప్రతిస్పర్ధతో నేవిద్యావిష యకములయిన
     యుద్ధములందయినడీకొనివిజయమును గాంచుట శక్యమేయగును.
కాని అజ్ఞానరూపమైనయీ శత్రువును మాత్రమెదిరింజయంబు గాంచుట
శక్యమగునా?నిన్ను సేవించినచో నయ్యది శక్యమగును.
                                             
   82 .శా||దీవుల్ మారిన నీ భవాబ్ధినెటనో దేవా!భవత్పాదప 
         ద్మావిర్భూత మరందధారలకుసందర్భించు నా ధారణా
        శ్రీవైదగ్ధిని మార్చకయ్య భవవైరీ!యార్షధర్మాకృతీ!
       దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!ఈ సంసారసముద్రములో దీవులెన్ని మారిననూ నీ
    పాదపద్మ మకరందధారలపై బ్రవహించు నాయాలోచనము నందలి
    నేర్పును మాత్రముమార్చకుము.నీవుభవవైరివి,ఆర్షధర్మస్వరూపుడవు.

  83.శా|| ఓ విశ్వేశ్వర!ఓ శ్రితార్తిహర!ఓహోహో !పరార్ధస్ఫురా
            ఓ విష్ణ్వాకృతీ !ఓ మనోజనికృతీ!ఓహో !విషస్వీకృతీ !
           ఓ వీరేశ్వర!ఓ హృదంతర !హరా!ఓహో!సదాధార!శ్రీ
           దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! నీవు సమస్త ప్రపంచానికి ప్రభువు.నిన్ను ఆశ్రయించినవారి పీడలను పోగొట్టువాడవు.పరమార్ధరూపమున్ బ్రకాశించువాడవు,సర్వవ్యాపకయాకారా!మదన హర ! లోకక్షేమంకోసం విషాన్ని మింగినవాడా!వీరులకు ప్రభువవు.హృదయముల లోపలిభాగమైనవాడా !మంచికాధారమైన వాడా!నిన్నెపుడుస్మరించెదను.

84.శా||భావాతీతచరిత్ర !పంకజసఖీ ప్రాంచత్సుగాత్రా!నమ
        త్సేవాపాత్ర!శ్మశానసంగతగతి శ్రీనిష్ఠ !కల్యాణ వి
        ద్యావారాన్నిధిబధ్ధబంధుర మహాధారాయిత స్తోత్ర !శ్రీ
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!భావమునకందని చరిత్రగలవాడా!స్త్రీరత్నముచే బ్రకాశించువాడా! శ్మశానసంచారసంపదయందునిష్ఠగలవాడా!మంగళమైన
విద్యయను (ఆత్మవిద్యయను)సముద్రమున గూర్చబడిన మహాధారగానైన
భక్తులస్తోత్రములు గలవాడా!నిన్ను స్మరించెదను.

    85 .శా||ఆవిర్భూతసస్తభూతకలనవ్యాపార సంధాన!స
            త్యావాసా!బహుధాపరిస్ఫురితమత్యావిష్ట మూర్తీ !గుణా
            భావా!భావభవాంతకా! శుభపరా! బ్రహ్మాండభాండోదరా
              దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా! నీవు సమస్త భూతములవ్యాపారములను సమ
    కూర్చువాడవు.సత్యమందున్నవాడా!పలువిధాలబ్రకాశించు బుద్ధి యందావేశించు స్వరూపము గలవాడా!శుభమునందు ఆసక్తి గలవాడా!

నిర్గుణుడా!మదనహరా!నిన్ను ధ్యానిoచెదను.