రావూరి వారి అభినందన పద్యాలు
రావూరి వారి అభినందనలు
మంచిలి గ్రామనివాసి శ్రీ రావూరి సత్యనారాయణగారు రచించిన సమస్యామంజరి అనుగ్రంధమునకు కొవ్వూరు గ్రామనివాసియగు శ్రీ రావూరి వెంకటేశ్వర్లు గారి అభినందనలు.
శ్రీ మాత్రేనమః
శ్రీ సంతానపరంపరాకలిత విస్ఫీతాంధ్ర భాషాసతీ
రాసిక్యమ్ములలోసమస్యలను సారమ్మైన భావమ్ములన్
మోసుల్ వారెడు శబ్ద సంపదను సమ్మోదమ్ము సంధింప శ్రీ
వేసల్ రేగగబూరణమ్ముల గళాహిందోళముల్ పాడితౌ.
అన్నా మనవంశమ్మున
కెన్నన్ బటుకీర్తి మెఱయ నింపొందగ నీ
తెన్నున కావ్యము గుణ సం
పన్నత నిర్మించితీవు బ్రహ్మణ్యుడవై .
శ్రీయుతమూర్తి నీ హృదయసీమను నెక్కొను భక్తిపాండితీ
వ్యాయతభావ సంపద యభంగురలీలల తల్లిదండ్రులున్
వేయి విధాల గీర్తనము విస్ఫురితంబొనరింప గావ్యమి
ట్లాయితముంబొనర్చితివి యంజలిబంధము నీకు సోదరా!
చంద్రచూడుని స్తుతియించి జననిదుర్గ
నభినుతించిమహోజ్జ్వలమైన కైత
చెణకులను జూపినావు నిస్సీమభావ
పుష్టి దళుకొత్త భారతీ పూజ గాగ!
సత్యనారాయణాభిఖ్యసౌరుమెఱయ
సరస సాహిత్య సౌభాగ్య సంపదుదయ
భాసురమ్ముగకృతినిల్పి బహుళమైన
మోదమును గూర్చితీవు సంపూర్ణముగను!
No comments:
Post a Comment