Saturday, 28 July 2018

తులసీ శతకము -2.

                                - 2 -

26.దయగల ప్రభువుల కడ భట 

చయము న్నియమింత్రు చనవు సలుపక యుండన్ 

ప్రియమారు గులాబీలకు 

నియమింపడె సృష్టికర్త నిండుగ దులసీ!

27.ఎవరంటరానివాడన ?

 తివిరి యకృత్య ములు సేయు తెంపరి యొకడే;

భువి తాత తండ్రులిడిరని 

చవిటి పొలము నెవడు సాగు సలుపును దులసీ!

28.ఉందుమె తిరముగ ననరొక 

కొందఱు తమవెంట నేమి కొంపోదురొకో?

ఎందఱొొ యేలిరి ధరనొక 

కొందఱె పేర్వడిరి దాన గుణమున దులసీ!

29.చుట్టగ వచ్చును బృ ధివిo ,

బట్టంగా వచ్చు బుకిట పాధో నిధినే,

ముట్టగ వచ్చును దివి,నెటు 

నెట్టంగా నెవరి తరము నియతిం ?తులసీ!

 ౩౦.పాలకడవ చెయి జార్చిన 

నేలంబడి వ్రీలి పాలు నేలగలియవే?

తేలికగా మృదుమతులను 

వేళాకోళంబు  సేత వెడగగు తులసీ!

31.పరువుం జెఱచునుత్రాగుడు 

చెఱచు శరీరంబు వేశ్య చెలిమి ,గృహంబున్

జెఱచు దురోదర మట్టులె 

సరగ మౌఢ్యo బు  చెఱచు సర్వము  తులసీ!

32 .అవివేకు లెందరున్నను 

సువివేకి యొకండెకులము శోభిలజేయున్ 

దివినెన్నితారలున్నను  

ధవళాంశుడె  వెలుగు నిచ్చి తనుపును దులసీ||

  33.వింతలు కనబడినపుడు ప్ర 

శాంతముగా నూహసేయ సత్యము తెలియున్ 

ఎంతటి గారడియును మతి 

మంతులు గ్రహియింత్రు గడియ మాత్రనె తులసీ||

34.రుచియింపక  గర్వాంధుడు 

శుచియగు హితమెపుడు చెవిని జోరనీడు గదా 

రుచియించునె చింతామణి 

నుచితముగా చచ్చువాని కొసగిన దులసీ||

35.మాన ప్రాణoబులలో 

మానమె ప్రాణంబు కంటె మాన్యము తలపన్ 

మానినులు మల్లమాదులు 

మానము రక్షించుకొనగ మ్రందరె ?తులసీ?

36.దయయును దానగుణంబును 

నియమం బఘభీతి నిష్ఠనిజవర్తనమున్ 

ప్రియ భాషణంబు లజ్జయు

నయముంగల వారి మైత్రి నడపుము తులసీ||

37.ఉన్నదియె పుష్టి నరునకు 

తిన్నదియే పుష్టి యాల దేహంబులకున్ ,

మిన్నునకు పుష్టి వెన్నెల 

కన్నంబే పుష్టి చౌర్య కర్తకు దులసీ||

38.అప్పులు పెరిగిన వానిన్ ,

గొప్పకు జాడీలు చెప్పు కుజనుని ,నీతిం 

దప్పిన వానిం జేరిన 

నెప్పుడొ  ముప్పొదవితీరు నెఱుగుము తులసీ||

39.పెంచును విలువను త్యాగము 

దించును తన స్వార్ధగుణమె  తిరమగు కీర్తిన్ 

కుంచించు భయము మనుజుని 

వంచించును వెడగు దనము వసుధను దులసీ ||

40.వెలుగు రవి పగటివేళనె 

నెలవెలుగును రేలనొక్క నిలకడ గనకే 

వెలగల విజ్ఞుని తెలివియొ 

వెలుగుం బ్రజమెచ్చ నెల్లవేళల దులసీ||      

41.సిరిలేకయు సుఖమబ్బును 

సరిగ ననామయము లేక సౌఖ్యమొదవునే 

సిరి కన్న ననామయమే 

వరమని తద్రక్ష సేయవలయును దులసీ||

42.కష్టమునకు దగుభృతి నిడ 

కిష్టమ్ముగ తిట్టు కుజను నేమనవలయున్ 

భ్రష్ట యగు గొడ్డు రాలెటు 

కష్టతర ప్రసవబాధ కనుగొను దులసీ!

43.తొణకకుము ఘనత పెరిగిన 

నణకువతో మెలగుమెంత యౌన్నత్యమునన్  

తృణ రాజ మెక్కునప్పుడు 

బెణికినచో  గాలు ,క్రింద బెట్టడె  ?తులసీ!

4 4 .సిరితరమని మురియుకుమీ 

జరిగినవరకాచరింపు సత్కార్యములన్ 

వెరవకు మెవరేమన్నను  

ధర బెరుగును కీర్తి కొన్ని తరముల తులసీ||

45.సిరికిన్ లేదొక నిలకడ 

సరి పతినే    విడిచిపోయి చేరె  బలీంద్రున్ 

సిరి కన్న మిన్న పరపతి 

పరపతి నార్జించుకొంచు బ్రదుకుము తులసీ!

46.రూపము  ధనముం గలిగియు 

నూపిరియగు విద్యలేక యొప్పడు ధరలో 

నేపుగ పెరుగు పయిరునకు 

గాపే లేకున్న ఫలము కలదే?తులసీ!

47.కలవారి తోడ కలహము 

నిలుకడగా చుట్టమింట నిలుచుట,పరదా 

రల గోరుట యను మూడును  

కలిగించును మానహాని కడపక తులసీ!       

48.అడవిన్ గాసిన వెన్నెల ,

కడలిన్ వర్షించు వాన,కాదు వృద్ధుని చే

పడు పడుచు భార్య ,ధనికున

కిడు దానము నిష్ఫలంబులే యగు దులసీ!

49.శక్తికి మించిన దానము  

రక్తింగొలుపంగ లేని రాగ,మదనున్ 

యుక్తి నెఱుంగని సచివత,

భక్తియుతము గాని పూజ వ్యర్ధము తులసీ!

50.వింతగు వేసముతో వే 

దాంతోక్తుల్ చదివి నంత నగునే సిధ్ధుం 

డాంతర మలమినభ్రాంతిని 

సొంతము విడనాడలేని యజ్ఞుడు తులసీ!

51.వేప తరువునకు చేదును 

మాపంగాదరమె యెంత మధువెరు విడినన్ 

దీపించు సూక్తి బోధల 

పాపాత్ముని పాపబుద్ధి పాయునె?తులసీ!

52 .అల్లురకును నల్లులకును 

ఉల్లంబే లేని యట్టి యుద్యోగులకున్ 

మొల్లపు వెలదులకును నిలు 

వెల్లను దోచుకొను బుద్దియే సుమి తులసీ!

53.ఎప్పుడు పారును నది ప్రజ 

దప్పి దీర్ప ,వెలుగు నిడగ దా రవి  దిక్కుల్ 

తప్పక తిరుగును గద ;ఘను 

లెప్పుడు జన సేవ కొఱకె యెంతురు తులసీ!

54.ఆచరణము లేకుండిన 

వేచదువులు చదివియున్న విఫలమె సుమ్మీ,

వాచా దీపం బనగనె 

యేచిన చీకట్లు చెదురునెట్టులు ?తులసీ!

55.గొ ప్పనుకొని  విజ్ఞులతో 

తప్పుడు చాడీలు చెప్పదలచిన  ధరలో 

నెప్పుడు విజయము కలుగదు 

నిప్పునకున్ చెదలు పట్ట నేర్చునె?తులసీ!

 56.వినుమీ స్వజనుల కంటెను 

గనుమీ నీ పొరుగువారి కష్టంబులనే 

తనవారు మెచ్చరె ప్పుడు 

వినయము తో గొ ల్త్రు నిన్ను పెరలే  తులసీ!

57.ధనము గల వాని కెంతటి 

ఘనదోషములున్న నతని గణియింతురు సూ 

వినయము సుగుణము లున్నచొ 

ధనహీనుండైన వాని దలపరు  తులసీ!

58.సిగ్గును గావావు వలువలు 

నిగ్గుగ నీ పరువు నిల్ప నేరక యున్నన్ 

గగ్గరులు  కలుగు పందికి 

రగ్గును గప్పినను గలదె రమ్యత  తులసీ!

59.ఆదమరచి నట్టి కృషియు 

సాధన లేక యున్న సంగీతంబున్

బొధనము లేని మతము 

నాధుడు లేనట్టి యిల్లు నాసిలు దులసీ!

60.పంచంగ వచ్చు నినుమును,

అంచులపై  బారు నదుల నాపగ వచ్చున్ 

పెంచంగ  వచ్చు బులులను 

వంచంగా దరమె పెంకి  వనితను దులసీ! 

      

                                                                                                                                                                                


No comments:

Post a Comment