తులసీ శతక ము
శ్రీ మట్టా వేంకటేశ్వరరావు
ప్రార్ధన
శ్రీదయితా!సీతాపతి!
వేదాంతి జనైకవేద్య! విబుధారాధ్యా!
కోదండ ధారి!భూజన
తాదర్శా!రామభద్ర!అంజలి గొనుమా!
నల్లని వానిని భూమిజ
వల్లభు సాకేతవాసు వనరుహవదనున్
ఎల్ల జగములకు వెలుగౌ
చల్లని శ్రీ రామమూర్తి శరణము నాకున్.
గణములకధినాయకు స
ద్గుణితతులకు మేలుబంతి గుజ్జగు వేల్పున్
ఫణిధరు ముద్దులపట్టిని
గణనాధుని మదిని దలచి కవితనొనర్తున్ .
వాణిని ధాతకు వలపుల
రాణిని సాహిత్య గాన రాగిణి వీణా
పాణిని చదువులనిడు నలి
వేణిని సత్కవిత నిడగ వేడెద నెపుడున్ .
* తులసీశతకము *
1.శ్రీ రఘుపతి కృపచేతను
ధారణి వ్రాయుదును నీటి ధర్మము సత్యం
బోరిమితో జదివిన జే
కూరును నీమదికి బ్రీతి కూరిమి తులసీ !
2.పచ్చని తోరణములతో
ముచ్చటగా దీర్చినట్టి ముగ్గులలోనన్
మెచ్చిన తోబుట్టుల కడ
లచ్చి వసించుచు నొనర్చు లాస్యము తులసీ!
3.సిరియే మూలము జగతికి
సిరి తోడనె దైవముండు సిద్ధము గానన్
సిరిబాసినట్టి మనుజుడు
నరసి విడిన మకరి కాడె?సత్యము తులసీ!
4.జాతిని గొప్పగా జెప్పెను
నీతియె పోషించుచుండు నిజముగ జాతిన్
వాతపడు వధువు కంటెను
నీతిచెడని విధవ నయము నిక్కము తులసీ!
5.మతములు కులములు ననుచున్
సతమతమై లోకమెల్లసత్యము విడిచెన్
మతముల గమ్యమొకటె యని
మతినెఱిిగి చరించు వాడె మాన్యుడు తులసీ!
6.వృద్ధ సమయోచితముగ
బుద్ధిగఱపి ప్రజల భయము పోగొట్టవలెన్
వృద్ధుండయ్యును -మేలగు
పద్ధతి గనడేని నిందపాలగు దులసీ!
7.మెప్పునకై శ్రీమంతున
కప్పిడిన ఘనంబె?యనద నాదుకొనవలెన్
చప్పని కూరను గాదని
యుప్పును జలనిధిని వేయుటుచితమ?తులసీ!
8.హితకరులగు పితరులకున్
సతి తోడను సేవజేయ సద్గతి కల్గున్
మతిలేని రాతి ప్రతిమల
నుతి జేసిన నేమి -నోరునొ వ్వదె ?తులసీ!
9.పెంచుకొనకు కోర్కులగని,
వంచింపగ వలదు పరుల,వసుధనొరులలో
నెంచరు దోసమ్ముల,సవ
రించుకొనుము నీదు తప్పులెప్పుడు తులసీ!
10.కర్మమున బొడము జగములు
కర్మంబున నణుగుచుండు గాలము దరియున్
కర్మమె జన్మము మూలము
కర్మమె సుఖదుఃఖ కారకంబగు దులసీ!
11.పురపతి వెలుగును బురమున
నరపతి తన జన పదంబునన్ వెలుగొందున్
నెఱి గలిగిన విద్వాంసుడు
ధరనెల్లెడలందువేలుగా దక్షుడు తులసీ!
12.పండితుడు పస వెలార్చును,న
పండితుడో మొఱుగు నె యవాకులొ పెలుచున్
నిండిన భాండము తొణకదు
కొండ వెలితియైననె తొణకుoగద!తులసీ!
13.ఎంతటి దక్షుoడైనను
కొంతేనియు హితుల పొత్తు కోరగవలయున్
అంతటి దహనుడె గాలి ర
వంతయినను దోడుపడక యడరునె?తులసీ!
14.చేయకు నీచుల స్నేహము
పాయక నీ తొంటి గౌరవం బణగాఱున్
తీయగ గూసెడికోయిల
వాయసముల చెల్మి నిందపాలగు దులసీ!
15.కనికరమెఱుగని ధూర్తుడు
చనవిచ్చిన జేయు ముప్పు సమయము గనుచున్
పనిమాలి ఫణిని మెడనిడ
వెనుదీయనె నెట్టుకాటు వేయక ?తులసీ!
16.ఒరుల సిరి జూచి యేడ్వకు
నిరతంబు శ్రమింతువేని నీకుంగలుగున్
తరువున నందలి ఫలముల
నరసి యఱచినంతమాత్ర నందునె?తులసీ!
17.తనకెంత యుండినను దా
దినకొరులకునిడక యున్నదియు నొక ధనమే?
కను పండువుగా నంబుధి
గొని త్రావని జలములున్న గొఱయే ?తులసీ!
18.మలతురు శిల్పివరులు తమ
యులి మొనలన్ గఠిన శిలల నొప్పలరారన్
తెలివిగల గురులు శిష్యుల
బలుకులతో దిద్ది తీర్పవలతురు తులసీ!
19.అరిషట్కమును జయించిన
వెరవరి యొ క్కండెసూ వివేకియనంగన్
గుఱి లేని బలులు పూజలు
పొరిబొరి సల్పినను ముక్తి బోరయునె ?తులసీ !
20.సలలితమగు సత్కవితకు
విలువెఱుగని బాలిశుండు విఱుచుంబెదవిన్
విలసిల్లు కలికి మురిపెపు
చెలువముగని పేడి వేడ్క జెందునె?తులసీ!
21.ఎదురేది జితేంద్రియునకు
ముదముగ ధర్మార్ధకామ మోక్షము లొదవున్
అదనెఱిగి పదునుబెట్టిన
కొదవగునే ధాన్యరాశి కోర్కెకు ?తులసీ!
22.మానమె ధనమనుకొను నభి
మానులు తలమోడ్పరెంత మాత్రంబరికిన్
తా నములునె కసవును బల
హీనస్ధితినైన సింగమెప్పుడు తులసీ!
23.భువి విధి గానని సృష్టిన్
గవి చేయుచు నుండు నవ్య కావ్య స్ఫూర్తిన్
నవరస భావ సమున్నతి
జవి దేల్చెడు కవి ధరిత్రి జావడు తులసీ!
24.వేగిరపడి దుష్టుల యెడ
సాగింపకు సాహసంబు సహనమె మేలౌ
కాగల కార్యము దీర్పం
గా గంధర్వులె తమంత కలుగరె ?తులసీ!
25.ఆలి యెరుగును బూదీవియ
బాలు దూరమునందు నున్న బ్లవగమెఱుగునే?
అలతి జడుడు విద్వాంసుని
వలె దెలివిం జూపి మెరయ వలతియె?తులసీ!
No comments:
Post a Comment