Saturday, 28 July 2018

తులసీ శతకము -3

                                -3-

61.ధృతి చెడి రణమున బారియు 

మృతి గను భటునకు  గృ తఘ్న  మిత్రఘ్నులకున్ 

సతమనృత  భాషికిని స 

ద్గతులే గతి గలుగవంచు గనుమా?

62.ఎఱిగి ఎఱుంగక చేసిన 

కొఱగామికి తగిన శాస్తి కొంచక గలుగున్ 

ఎఱుక చెడి కాల ద్రొక్కిన 

కొఱవి దహింపకయె  యూరకొనునే తులసీ!

63.ఎక్కడనొ లేదు పాపము 

నిక్కముగా వెఱపు లేని నీ చేతులలో 

నెక్కొని యున్నది మానక 

బొక్కసమున దాచుకొన్న పోలిక తులసీ!

64.అందముల నలరు సుందరి 

నిందల గారించు మొఱకు నేర్చునె?సుఖముం 

జెందగ ,నందన వనమున 

పంది వినోదంబు లవము పడయునె ?తులసీ!

65.పరధనముల తిన మరిగిన 

నరుడించుక తృప్తి గొనక నాశము చేయున్ 

తరువుల బట్టిన చీడలు 

పొరి బొరి దిని తుదకు గూల్చు పోలిక తులసీ! 

66. మిన్నగ జదువును దెలివియు 

నున్నను దురదృష్ట  మలమియుండిన వేళన్ 

వన్నెకు నెక్కడు వజ్రము 

మన్నున గప్పంగ బడిన మాదిరి తులసీ!

67.బాధగురు లెప్డు స్వార్ధము 

సాధింపగ  వాద భేద చాతుర్యముతో 

వేధింత్రు వారి బోధల 

బాధంతయు సొమ్ము లాగువఱకే తులసీ!

68.మందులు ఘనులగువారల 

చందంబును విలువ నెఱుగజాలక చులకన్ 

గందురు కోయలు చేయరె  

గంధపు దరువులను వంటకట్టెల దులసీ!

69.మాయమ్మైపోయెను గద 

న్యాయము ధర్మమ్ము దేశనాయకులందున్ 

మాయురె ;దేశంబున కిక 

శ్రేయో లాభంబు లెట్లు చేకురు?తులసీ! 

70.ఎఱుగడు తన తప్పుల ఖలు 

డరయుచునే యుండు నొరులయందలి  తప్పుల్ 

కురువిందము తన నీలిమ 

నెఱుగంగా గలదె యెన్నడేనియు దులసీ!  

71.కోరకయిచ్చెడు దాతయు 

నోరిమి నరివర్గమెల్ల నొడిచిన భటుడున్ 

గూరిమి బొరయని జననియు 

నారయ నీ మువ్వురవని నరుదౌ దులసీ!

72.ఎంత బలవంతుడైనను 

పంతంబులు పలుకరాదు పలువురిలోనన్ 

దంతి యొక వెంటి చేతను 

వింతగ బంధిoపబడుట  వినమే?తులసీ!

73.కొంత యెదియొ తెలిసినచో 

నంతయు దెలిసెనని పొంగు టవివేకంబౌ

నంతము గలదే విద్యల?

కెంత యెఱింగినను మిగులటెఱుగమే ?తులసీ! 

74.విందులకు మాత్రము వచ్చుచు 

బందుగునని మెక్కి పోయి పదపడి యిడుమల్ 

క్రందు కొన తొంగి చూడని 

బందుని రాబందువనుట భావ్యము తులసీ!

75 .తెలిసియొ  తెలియకయో తా 

సలిపిన తొలి తప్పు నెఱిగి సజ్జనుడగు వా 

డలయక  పశ్చాత్తాపం 

బెలమిం బ్రకటించు,నొప్పడితరుడు తులసీ!

76.త్యాగంబు,కళలయందను 

రాగంబు,సభాంతరముల రమ్య మృదూక్త్యా 

చేగంబు,కదన శౌర్యో 

ద్యోగంబు లభించు బుట్టుతోడనె తులసీ!

77.కార్యముల మాని ,పూనియ 

కార్యములకు ,నెదురు తిరిగి ,కడకన్ నిరతా 

వార్యయగు నప్పడంతుక 

భార్యయొకో ప్రక్క లోని బల్లెము తులసీ!

78.ఆవులె యందము మందకు 

పూవులె యందంబు దెచ్చు బూ దోటలకున్ 

బావుల కందము జల ,మే 

ధావులె యందంబు మాతృ ధాత్రికి దులసీ!


79.పాలకు దేనెకు దీటై 

క్రాలిన మన తెనుగుబాస రాయల నాటన్

లాలనము చెందె దానికి 

ఆలనయే  లేదు నేటికకటా ;తులసీ !

80.కీర్తి ధను సత్యశీలుని 

గుర్తింపక గెలిసేసి కొల్వదు లోకం 

బార్తిపడు  ధూర్తు గొలువగ ,

వర్తనమిటు సాగుచుండె వసుధను తులసీ!

81 .ఓరిమి చాలక యుండిన 

సారెకు వైరములె వచ్చి శాంతి నడంచున్ 

నోరొకటి మంచి దగునెడ 

నూరపుడే మంచిదగుచుండును దులసీ!

82.నిక్కచ్చిగ  శాస్త్రంబుల 

నుక్కీడున కెంత చెప్పా నొంట నిముడునా?

మిక్కిలిగ లాగి కట్టిన 

గుక్కకు గల తోక వంక కుదురునె?తులసీ!      

    

83.నిరతమొడలు వంచినచో 

కరవుండదు కష్టపడిన గలిమియుగలుగున్ 

పెరుగును దరువక పై పై 

కరుదెంచునె వెన్న ?చేతికందునె ?తులసీ!

84.క్రొత్తగ వచ్చిన వారల 

మెత్తగ మాటాడి నంత మేకొనకుము,త 

చ్చిత్తముల మంచి చెడ్డల 

సత్తెము గుర్తించి చేయు సఖ్యము తులసీ!

85.    సర్పముల మృతికి దలయం 

దేర్పడి యున్నట్టి విషమె హేతువు కాదే?

నేర్పె ఱుగని  మూర్ఖులకు 

న్దర్పమె  కద పతన కారణంబగు దులసీ! 

 

No comments:

Post a Comment