నారాయణ శతకము
నారాయణ శతకము
పోతన
శా || శ్రీ రామామణి పాణి పంకజ మృదు శ్రీ తజ్ఞ పాదాబ్జశృం
గారాకార శరీర చారుకరుణాగంభీర సద్భక్త మం
దారాంభోరుహపత్ర లోచన కళా ధారోరు సంపత్సుధా
పారావారవిహార!నాదురితముల్ భంజింపు నారాయణా ! 1
శా || కడకుం బాయక వేయినోళ్లు గలయాకాకోదరాధీశుండుం
గడముట్ట న్వినుతింపలేక నిగుడఁన్ గ్రాలంగ నొప్పారుమి
మ్మడరన్ సన్నుతిసేయ నడువశమే యజ్ఞాని లోభాత్ముడన్
జఢుడన్నజ్ఞుడ నైక జిహ్వుడ జన స్తబ్ధుండ నారాయణా !2
శా || నే నీదాసుడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరిన్
ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకు న్నా నేర్చుచందంబునన్
నీనామ స్తుతులాచరించు నెడల న్నేతప్పులుంగల్దినన్
వానిన్ లోగొనుమయ్య తండ్రి!విహితవ్యాపార నారాయణా !3
మ || నెరయ నిర్మల మైన నీస్తుతికధానీకంబు పద్యంబులో
నొరుగుల్ మిక్కిలి గల్గె నేనియు గడు న్యోగ్యంబే చర్చింపగా
గుఱుగణ్పైనను వంకబోయిన గడుం గుజ్జైనబేడె త్తినం
జెరుకుంగోలకు తీపుగాక కలదే చేదెందు నారాయణా !4
మ || చదువుల్ పెక్కులు సంగ్రహించి పిదపం జాలంగసుజ్ఞానియై
మదిలో బాయక నిన్ను నిల్పదగు నా మర్మంబు వీక్షింపడే
మొదలు గాడిదచారు గంధవితతుల్ మోవంగశక్యంబె కా
కది సౌరభ్యపరీక్ష జూడ కుశలే యవ్యక్త నారాయణా | 5
మ || లలిగబ్బoబు కరాటమి వ్విధనెల్లన్మించె బో నీకథా
వలి కర్పూరము నించినన్నితరమౌ వ్యర్ధార్ధకామోదముల్
పెలుచంబూనినయక్కరాటము తుదిన్ బేతే కరాటంబెపో
చలాదిందీవరపత్ర లోచన ఘనశ్యామాంగ నారాయణా | 6|
మ || మనమారన్నచలేంద్ర జాధిపతికి నాస్తాగ్రామాణిక్యమై
మునికోపానలదగ్ధ రాజతతికిన్ముక్తిస్ఫురన్మార్గమై
యెనయన్ పాయకశాయికిం జననియై యేపారుమిన్నేటికిం
జనిమూలంబగు నంఘ్రినాదుమదిలో జర్చింతు నారాయణా !7
శా || నీ పుత్రుండు చరాచర ప్రతతుల న్నిర్మించి పెంపారఁగా
నీపుణ్యాOగన సర్వ జీవతతుల న్నిత్యంబు రక్షింపగా
నీ పాదోదకమీజగ త్త్రయముల న్నిష్పాపులం జేయగా
నీ పెంపేమని చెప్పవచ్చుఁ సుగుణా నిత్యాత్మ నారాయణా !8
శా || బ్రహ్మాoడావలిలో సత్వగుణివై బాహ్యoబునందాదిమ
బ్రహ్మాఖ్యం బరతత్వ బోధములకున్ భవ్యాధినాధుండవై
బ్రహ్మేంద్రామరవాయుభుక్పతులకున్ భావింప రాకున్ననా
జిహ్మవ్యాప్తులనెన్న నాదువశమే చిద్రూప నారాయణా !9
మ|| ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయములెల్ల వందిగణమైబ్రహ్మా0డమాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
వరుసన్నీఘన రాజసంబు నిజమై వర్ధిల్లు నా రాయణా !10
మ|| మగమీనాకృతి వార్ధిజొచ్చి యసురన్మర్దించియవ్వేదముల్
మగుడం దెఛ్చి విరించి కిచ్చి యతని న్మన్నించి యేపారగా
బగసాధించిన దివ్యమూర్తి వాణి భావింతునెల్లప్పుడున్
ఖగ రాజధ్వజ భక్తవత్సల జగత్కారుణ్య నారాయణా !!11
మ|| అమరుల్ రాక్షసనాయకుల్ కడకతో నత్యంత సామర్ధ్యులై
భ్రమరీ దండము మందరాచలముగా బాదోనిధిం ద్రచ్చగా
దమకించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం
గమకంబై ధరియించి మించినజగత్కళ్యాణ నారాయణా !12
శా|| భీమాకార వరాహమై భువనముల్ భీతిల్లి కంపింపను
ద్దామోర్విo గొనిపోయి నీరనిధిలోడాగున్న గర్వాంధునిన్
హేమాక్షాసురు వీకదాఁకి జయలక్ష్మిన్ గారవింపంగ నీ
భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా !!13
శా || స్తంభంబందు నృసింహమై వెడలి యచ్ఛండాట్టధ్వనుల్
దంభోళిం గడువంగ హేమకశిపోద్దాండాసురాధీశ్వరున్
శుంభ ద్గర్భము వ్రచ్చి వానిసుతునిన్ శోభిల్ల మన్నైనుంచియ
జ్జం భారాతినిబ్రీతి దేల్చిన నినుం జర్చింతు నారాయణా !!14
మ||మహియు న్నాకసముం బదద్వయపరీమాణంబుగా బెట్టి యా
గ్రహమొప్పం బలిమస్తకంబొక పదగ్రస్తంబుగా నెమ్మితో
విహరించింద్ర విరించి శంకరమహావిర్భూత దివ్యాకృతిన్
సహజంబై విలసిల్లు వామనలసచ్చా రిత్ర నాఱయణా !!15
మ || ధరణిన్ రక్తమహాహ్రదంబు లెలమి 0ద్రైలోక్యనిర్దిష్టమై
పరగ0బైతృకతర్పణంబుకొఱకై ప్రఖ్యాతిగా దీవ్రతన్
నిరువయ్యొక్కటి మారు క్షత్రవరులన్నేపారనిర్జించి త
త్పరశుభ్రాజిత రామనామము కడున్ ధన్యంబు నారాయణా !!16
No comments:
Post a Comment