Friday, 14 July 2017

శ్రీమదుమాచోడేశ్వరశతకము -3 శ్రీ రావూరి వేంకటేశ్వర్లు

              శ్రీమదుమాచోడేశ్వరశతకము -3
                                   శ్రీ రావూరి వేంకటేశ్వర్లు
19 శా||నీ వాసంబగు వెండికొండపయిని న్నీకేమిలోటయ్యెరా
         నీవీ కొండను నిల్చినావు ధరణి న్నీ పాదపద్మమ్ములన్
         సేవింపన్సమకట్టువారలను  రక్షింపంగగాబోలు నో
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

||నీకు నిత్యనివాసమైన కైలాసము (వెండికొండ)న నీకేమి లోటు
      వచ్చినదయ్యా! చోడేశ్వరా!యీ దేవిపట్టణ పర్వతాన ఉంటున్నావు.
       నిన్ను నమ్మిన వారలను రక్షించడానికి కాబోలు.

20.శా||దేవా!తావకపాదపంకజములన్దీపించుభృoగంబనై
         ఏ వేళన్ మధుపానమత్తమతితో నీయెల్లయున్మాని నీ
        నీ సేవాసక్తత నిల్చిపోయెదను నా చిత్తంబు నీదే!శివా!
       దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||   చోడేశ్వరా!నేనెల్లప్పుడునునీ పాదపద్మములపై తిరుగు
       తుమ్మెదనయ్యెదను.నీ పాదపద్మముల మకరందమునుత్రాగి
      మందబుధ్ధితో నీసంసారమునంతటిని మఱచి నిశ్చలముగానుండి
       పోవుదును.నీవే నాసర్వస్వము నీవేగదా! 

21.శా||నీవే భక్తునిడెందమందయినసాన్నిధ్యంబునున్గాoచియున్
          నీ వాస్తావ్యముదెల్పియాలయ సమున్నిర్మాణమున్జేయగా
         ద్రోవన్జూపర!నీవ సర్వమునకు న్ద్రోవౌదువో యీశ్వరా    
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!   నీవే భక్తుని హృదయమునందయినను
      ప్రత్యక్షమై నీకు నాలయమును నిర్మించుటకు మార్గమును
     జూపుము.దేనికైనా నీవే మార్గదర్శుడవు గదా!

22.శా||దేవాధీశ్వర!పార్వతీశ్వర!కృపాదీవ్యత్స్వరూపా!గుణా
         భావా!సద్గుణభూషణా!సగుణ!విశ్వశ్రేయ!నైర్గుణ్యవి
         ద్యావారాంనిధి!సర్వలోక జనతాతాత్పర్యమర్యాద!శ్రీ
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||దేవతల ప్రభువా! పార్వాతీపతీ!దయాస్వరూపా!చోడేశ్వరా!నీవు
     సగుణ సద్రూపుడవు. నిర్గుణుడవు. బ్రహ్మజ్ఞాన సముద్రుడవు.

23.శా||గోవిందుండవు పద్మసంభవుడవున్ గోత్రేంద్రధర్ముండవున్
         నీవేయంచు దలoతునౌపనిషదోన్నీతంబు  సారంబునున్
         నీవే యంచు దలంతు నాయెడదయే నీవంచు భావింతునో
        దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||విష్ణువు,బ్రహ్మ,శివుడునునీవేయనిభావింతును.వేదాన్తములసా       రమైనబ్రహ్మజ్ఞానమునీవనిభావింతును.ఓచోడేశ్వరా!నాహృదయమేనీవు
గదా.

24.శా|| ఈవుల్లేనిధనిత్వమున్మధురవాక్కేలేని పాండిత్యమున్
           చేవల్లేని పరాక్రమోక్తులు గుణశ్రీలేని విద్వాంసుడున్
           జీవి ప్రేమలులేనిమానవతయున్  శ్రేష్ఠంబులెట్లౌనురా
           దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!త్యాగములేని ధనవంతుల ధర్మములు,తీయగాపలుకని            పాండిత్యము,శక్తిలేనిబీరపుపలుకులు,గుణహీనపండితుడును,భూతదయలేని మానవత గొప్పవి కావు.        

25.శా||నీవే దిక్కునజూ చినన్గగలవుగా నీ మాయచే స్రుక్కి మా
        భావంబుల్ నిను గాంచలేవు;ప్రతిమల్ భావత్కాముల్ మాకు శ్రీ
       దేవాగారములందు లక్ష్యములుగాదీపింపరా! శంకరా!
     దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!అంతటా నువ్వే ఐనను మేము అజ్ఞానముచేనిన్ను చూడలేకున్నాము.దయతో దేవాలయాలలో నీ విగ్రహాలనే మాకు లక్ష్యములుగా జేసి రక్షింపుము.

26.శా||నీవో బూడిదపూతగాడవు,మఱి న్నేనంతియే కాని యీ
         సావాసంబది ఏలనందువ? జగత్స్వామీ! భవత్  స్పర్శతో
        బ్రోవుల్ ప్రోవులు రాలు భూతి యొకడబ్బున్గాదెనాకంచునో
         దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!

తా||ఓ చోడేశ్వరా!నీవు,నేను బూడిద పుసుకోనేవారమే కాని నీ స్పర్శతో నాకు సంపద లభించునని చెలిమి చేయుటకు సిద్ధపడితిని.

27.త్రోవన్బోయెడువానినిల్పి కృపతో దుష్టిoపనన్నంబునున్
    సావాసంబునుగూర్చిభక్తతతితోసందర్శనంబిచ్చి నీ
    సేవాభాగ్యమునిచ్చినాడవికబాసెన్  నాదు కష్టంబు;శ్రీ
    దేవీ పట్టణ పర్వతేంద్ర శిఖరాధిష్ఠాన! చోడేశ్వరా!



తా|| ఓ చోడేశ్వరా!సరియగు లక్ష్యము లేక తిరుగు చున్న నన్ను నీభక్తునిగా జేసి    తృప్తిగా అన్నము పెట్టి సజ్జన సాంగత్యము కల్గించి నిన్ను సేవించు నదృష్టము గల్గించినావు.ఇక నా కష్టము గట్టెక్కినది.

No comments:

Post a Comment